Bill Gates: వేదికపై మానవ మలం... వింత చర్యతో అవాక్కు చేసిన బిల్ గేట్స్!

  • బీజింగ్ లో 'రీ ఇన్వెంటెడ్‌ టాయిలెట్‌ ఎక్స్‌పో'
  • మానవ వ్యర్థాలతో ప్రత్యక్షమైన బిల్ గేట్స్
  • తిండి మాత్రమే మానవులకు సరిపోదని వెల్లడి
  • పరిశుభ్రమైన మరుగుదొడ్లు కూడా కావాలన్న గేట్స్

వరల్డ్ బిలియనీర్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఓ వేదికపైకి మానవ మలాన్ని తీసుకు వచ్చి, అక్కడున్న వారందరినీ అవాక్కు చేశారు. ప్రస్తుతం బీజింగ్ లో పర్యటిస్తున్న ఆయన, బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ తరఫున 'రీ ఇన్వెంటెడ్‌ టాయిలెట్‌ ఎక్స్‌పో' పేరిట జరిగిన సదస్సులో పాల్గొన్నారు. పారిశుద్ధ్య రంగంలో చవకైన నూతన ఆవిష్కరణలను ప్రజల ముందుకు తీసుకు రావడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది.

మానవ వ్యర్థాలను ఓ గాజు సీసాలో వేదికపైకి తెచ్చిన ఆయన, "ఆరోగ్యం, తినడానికి కావాల్సినంత ఆహారం మాత్రమే ఉంటే సరిపోదు. ఒక మనిషికి కావాల్సింది ఇది మాత్రమే కాదు. ఈ జాబితాలో పరిశుభ్రమైన మరుగుదొడ్లను కూడా చేర్చాలి" అని అన్నారు. ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువమందికి పరిశుభ్రమైన మరుగుదొడ్లు లేవని గుర్తు చేశారు. అందుకే తాను ఈ పని చేశానని చెప్పారు. చైనా అధినేత షీ జిన్‌ పింగ్‌ ప్రారంభించిన 'టాయిలెట్‌ విప్లవం' తనను ఆకర్షించిందని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాలో పారిశుద్ధ్యం గణనీయంగా మెరుగైందని పొగడ్తలు గుప్పించారు.

More Telugu News