Telangana: టీఆర్ఎస్ జోరు.. 11న అభ్యర్థులకు బీ-ఫారం అందజేయనున్న కేసీఆర్!

  • కార్తీక పంచమి రోజున నామినేషన్లకు ఏర్పాట్లు
  • మరో 12 నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా పావులు
  • మహాకూటమి ప్రకటన తర్వాతే అభ్యర్థుల ఎంపిక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జోరు పెంచుతోంది. ఇప్పటికే 107 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీఆర్ఎస్, వీరికి పార్టీ బీ-ఫారాలను కూడా ముందుగానే అందజేయనుంది. ఈ నెల 11న ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలను టీఆర్ఎస్ అధిష్ఠానం అందించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 8న కార్తీకమాసం మొదలుకానున్న నేపథ్యంలో 12వ తేదీ(కార్తీక పంచమి) మంచి ముహూర్తమని చాలామంది గులాబీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఈ నెల 12న నామినేషన్లు దాఖలు చేసేందుకు చాలామంది టీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగానే ముందురోజు పార్టీ బీ-ఫారాలు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే సీనియర్ నేతలతో సమావేశమైన కేసీఆర్ పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా, మహాకూటమి ఈ నెల 10న తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే మిగిలిన 12 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నవంబర్ 11ను ముఖ్యమంత్రి ఎంపిక చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 11న ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించనుంది.

More Telugu News