Sabarimala: ఇప్పటివరకూ శబరిమల వెళ్తామని ఏ యువతీ చెప్పలేదు: కేరళ పోలీసులు

  • నేడు తెరచుకోనున్న ఆలయం
  • భద్రత కల్పించాలని ఎవరూ అడగలేదు
  • భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్న పోలీసులు

నేటి సాయంత్రం కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తెరచుకోనుండగా, ఇంతవరకూ తాము ఆలయానికి వెళ్తామని, భద్రత కల్పించాలని 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఏ మహిళా తమను సంప్రదించలేదని కేరళ పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఉదయం నుంచి శబరిమల పరిసరాల్లో ఆంక్షలను అమలు చేస్తున్నామని, 144 సెక్షన్, రేపు రాత్రి వరకూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నీలక్కల్ నుంచి పంబ, సన్నిధానానికి దారి తీసే మార్గాల్లో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశామని, 2,300 మంది విధుల్లో ఉన్నారని అన్నారు.

కాగా, నేడు పంబలో దాదాపు 5 వేల మంది భక్తులతో ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ అనుబంధ హిందూ పరిరక్షణ సమితి నిర్ణయించడంతో, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, ఈ ర్యాలీకి అనుమతి లేదని, అడ్డుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. భద్రత కల్పిస్తున్న పోలీసుల్లో 100 మంది మహిళా సిబ్బంది, 20 మంది కమాండోలు ఉన్నారని చెప్పారు.

More Telugu News