Congress: పేకాట గురించి ఎందుకయ్యా?... ముందు నీ మామను పోయి అడుగు: హరీశ్ రావుపై ఉత్తమ్ మండిపాటు!

  • కాంగ్రెస్ గెలిస్తే పేకాట క్లబ్బులు వస్తాయన్న హరీశ్ రావు
  • ముందు దళిత ముఖ్యమంత్రి ఎక్కడో కేసీఆర్ ను అడిగిరా
  • మూడెకరాల భూమి ఎప్పుడు ఇచ్చారో కనుక్కో
  • హరీశ్ రావుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, తాము మూసేయించిన పేకాట క్లబ్ లను తిరిగి తెరిపిస్తారని, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం అవుతుందని టీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేసిన ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పేకాట గురించి మాట్లాడుతున్న హరీశ్ రావు, ముందు కేసీఆర్ వద్దకు వెళ్లి, ఓ దళితుడిని సీఎంను చేస్తానని చెప్పిన హామీ ఏమైందో తెలుసుకుని రావాలని డిమాండ్ చేశారు.

దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి విషయం ఏమైందో తన మామను హరీశ్ రావు అడగాలని, తాగుబోతు కేసీఆర్, డ్రంకెన్ డ్రైవ్ ను తొలగించాలని చూస్తున్నారని, కుల రాజకీయాలకు పాల్పడుతూ, రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలన్నదే ఆయన ఆలోచనని నిప్పులు చెరిగారు.

తాము అధికారంలోకి వస్తే, ఉమ్మడి ఏపీలో బీసీలుగా ఉండి, ఇప్పుడు తొలగించబడిన 26 కులాలను తిరిగి బీసీల్లో చేరుస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే, తమ పొత్తుపై పడి ఏడవటం ఎందుకని ప్రశ్నించారు. మహాకూటమి గెలిస్తే, తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న గ్యారెంటీ ఏమీ లేదని, ఈ ఎన్నికల్లో 85 సీట్లు సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకం ఉందని చెప్పారు.

More Telugu News