Odisha: ఒడిశాలో మావోయిస్టులకు చావు దెబ్బ.. ఐదుగురిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!

  • మల్కన్ గిరిలో బలగాల కూంబింగ్
  • కాల్పులతో దద్దరిల్లిన బెజ్జంగ్ అటవీప్రాంతం
  • కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్

ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఈ రోజు చేపట్టిన కూంబింగ్ ఎన్ కౌంటర్ కు దారి తీసింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, మిగతావారు పరారయ్యారు. ఈ ఘటన మల్కన్ గిరి జిల్లాలోని బెజ్జంగ్ వాడ అటవీ ప్రాంతంలో ఈ రోజు చోటుచేసుకుంది.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. మావోల కదలికలపై సమాచారంతో కూంబింగ్ ప్రారంభించామని తెలిపారు. భద్రతాబలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని వెల్లడించారు. దీంతో భద్రతాబలగాలు సైతం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం చెందారనీ, మిగతావారు ఘటనాస్థలం నుంచి పరారయ్యారని తెలిపారు.

ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందనీ, మిగిలిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్ గఢ్ లో భద్రతాబలగాలపై మావోయిస్టులు విరుచుకుపడిన నేపథ్యంలో ఐదుగురు సభ్యుల మరణం మావోలకు గట్టి దెబ్బేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News