Telangana: బంగారు తెలంగాణ పేరుతో అనైతిక పనులు చేశారు.. కేసీఆర్ కు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ఘాటు లేఖ!

  • బాధ్యతలు యువతకు అప్పగించి తప్పుకోండి
  • రాష్ట్రం కేసీఆర్ చేతిలో బందీగా మారిపోయింది
  • ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోచుకున్నారు

తెలంగాణలో అధికార పగ్గాలను యువతకు అప్పగించి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ సూచించారు. ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే నాలుగున్నరేళ్ల కాలాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వృథా చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయ జీవితాన్ని వదిలేసి వ్యక్తిగత జీవితం చూసుకోవాలని హితవు పలికారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం అనైతిక కార్యక్రమాలకు పాల్పడిందని దుయ్యబట్టారు. ఈ రోజు దేవేందర్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.

గత నాలుగున్నరేళ్లలో తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన రాచరికాన్ని గుర్తుచేస్తోందన్నారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. కనీసం మంత్రులకు సైతం కేసీఆర్‌ దర్శన భాగ్యం లభించడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ భాష, ప్రవర్తనతో తెలంగాణకు మాయని మచ్చ తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని దేవేందర్‌ గౌడ్‌ అన్నారు.

More Telugu News