Telangana: తెలంగాణ ఏర్పడితే చీకటి రాష్ట్రం అవుతుందన్నారు.. కానీ కరెంట్ కోత అంటే ఏమిటో తెలియకుండా చేశాం!: కేటీఆర్

  • మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం
  • 90 శాతం తాగునీటి సమస్యను పరిష్కరించాం
  • తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో వెల్లడి

మహిళలకు భద్రత కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ విడిపోతే చీకటి రాష్ట్రంగా మారిపోతుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బెదిరించారనీ, ఇప్పుడు కరెంట్ కోత అంటే ఏమిటో తెలియకుండా చేశామని అన్నారు. ప్రస్తుతం సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఓ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

చిన్న కంపెనీ పెట్టుకోవాలన్నా, వ్యవసాయం చేసుకోవాలన్నా ధర్నా చౌక్ దగ్గర ఆందోళనలు చేసే పరిస్థితి గతంలో ఉండేదని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని అపార్ట్ మెంట్లలో విద్యుత్ కోతలు తట్టుకోలేక ప్రజలు డీజిల్ జనరేటర్లకు భారీగా ఖర్చు పెట్టేవారన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ కారణంగా ఇప్పుడు నిరంతరాయంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని వెల్లడించారు.

ఇందువల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. ఇక రాష్ట్రంలో సాగునీటి విషయంలో 90 శాతం సమస్యలు పరిష్కరించామనీ, మరో 10 శాతం ప్రాంతాలకు తాగునీటిని అందజేయాల్సి ఉందని అన్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News