Telangana: కాంగ్రెస్ పార్టీలో చేరిన డీఎస్, రాములు నాయక్, నర్సారెడ్డి!

  • ఎన్నికల్లో టీఆర్ఎస్ ను మట్టికరిపిస్తాం
  • బంగారు తెలంగాణ కోసం కాంగ్రెస్ లో చేరాం
  • మీడియా సమావేశంలో మాట్లాడిన నేతలు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. నిజామాబాద్ టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాములు నాయక్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్, రాములు నాయక్, నర్సారెడ్డిలను కండువా కప్పి రాహుల్ పార్టీలోకి ఆహ్వానించారు.

డీఎస్, రాములు నాయక్, నర్సారెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ను మహాకూటమి మట్టికరిపిస్తుందని జోస్యం చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. బంగారు తెలంగాణను సాధించేందుకే కాంగ్రెస్ లో చేరామని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్ కు వెళ్లామనీ, కానీ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం దూరమయిందని విమర్శించారు.

ఫాంహౌస్ సమీపంలోనే టీఆర్ఎస్ సర్పంచ్ ఒకరు చనిపోతే, చూసేందుకు కేసీఆర్ కనీసం బయటకు కూడా రాలేదని విమర్శించారు. బంగారు తెలంగాణ అన్న నినాదం కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమయిందని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం లేకపోవడం కారణంగానే తాము టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చామని ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. బంగారు తెలంగాణ కోరుకుంటే ఇప్పుడు బందీ తెలంగాణ మిగిలిందని విమర్శించారు. టీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపుతామని ధీమాగా చెప్పారు. జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్ ను అమలు చేయాలని రాహుల్ గాంధీని కోరామన్నారు.

More Telugu News