Hyderabad: బీజేవైఎం జాతీయ మహాసభలు.. హైదరాబాదుకు వచ్చిన బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు!

  • నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేవైఎం జాతీయ మహాసభలు
  • హైదరాబాద్ నగరానికి కాషాయ కళ
  • ఇప్పటికే చేరుకున్న పలువురు ప్రముఖులు

నేటి నుంచి రెండు రోజుల పాటు భారతీయ జనతా యువ మోర్చా జాతీయ మహాసభలు హైదరాబాద్ లో జరగనుండగా, నగరం కాషాయకళతో ఉట్టిపడుతోంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానం ఈ సభలకు వేదిక కానుండగా, పలువురు బీజేపీ అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు.

ఈ మహా సభలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. నేడు ప్రతినిధుల సమావేశాలు జరుగనుండగా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అతిథులుగా పాల్గొననున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, బిప్లవ్ దేవ్ కుమార్, సోనోవాల్ ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ తదితరులు నేటి సమావేశాలకు హాజరు కానున్నారు.

కాగా, వీఐపీల రాకతో నగరంలో ట్రాఫిక్ కు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ ఉదయం 7.30 గంటల సమయంలో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ కు దారితీసే ఫ్లయ్ ఓవర్ పై ట్రాఫిక్ జామ్ కావడంతో ఆఫీసులకు బయలుదేరినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్యాంక్ బండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కు అవాంతరాలు ఏర్పడ్డాయి. పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

More Telugu News