Mosore: అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆగిన రిజర్వు బ్యాంకు కంటైనర్.. అందులో రూ.2 వేల కోట్ల నగదు!

  • మైసూరు ప్రింటింగ్ ప్రెస్ నుంచి రిజర్వు బ్యాంకుకు మూడు కంటైనర్లు
  • ఒక్కో దాంట్లో రూ.2 వేల కోట్లు
  • అర్ధరాత్రి ఉద్రిక్తత

వేల కోట్ల రూపాయల కొత్త కరెన్సీతో రిజర్వు బ్యాంకుకు వెళ్తున్న కంటైనర్లలో ఒకటి నడిరాత్రి రోడ్డుపై ఆగిపోవడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని భద్రత చేపట్టారు. తుపాకులతో పహారా కాశారు. ఈలోగా మెకానిక్ వచ్చి మరమ్మతు చేయడంతో కంటైనర్ అక్కడి నుంచి కదిలింది. దీంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

గురువారం మధ్యాహ్నం రెండు వేల రూపాయల నోట్ల కట్టలు తీసుకుని మూడు కంటైనర్లు మైసూరు ప్రింటింగ్ ప్రెస్ నుంచి చెన్నై రిజర్వు బ్యాంకుకు బయలుదేరాయి. వీటిలో మొత్తం రూ.6 వేల కోట్లు ఉంది. రెండు లారీలు రిజర్వు బ్యాంకుకు చేరుకున్నాయి. మూడో లారీ మాత్రం రాత్రి 11 గంటల వేళ చెన్నై శివారు అమింజికరై వద్ద పూందమల్లి రోడ్డులో సాంకేతిక సమస్యతో ఆగిపోయి కదలనంటూ మొరాయించింది.

దీంతో వెంట ఉన్న భద్రతా సిబ్బందిలో ఆందోళన మొదలైంది. కంటైనర్ నిండా డబ్బు ఉండడంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే క్షణాల్లో అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది కంటైనర్‌కు తుపాకులతో పహారా కాశారు. అటువైపు ఒక్క వాహనం కూడా రాకుండా ట్రాఫిక్ మళ్లించారు. అనంతరం మెకానిక్‌ను రప్పించి సమస్యను సరిచేయించి రిజర్వు బ్యాంకుకు పంపి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో దాదాపు రెండు గంటలపాటు ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.  

More Telugu News