Andhra Pradesh: జగన్ పై ద్వేషాన్ని చంద్రబాబు బయటపెట్టుకున్నారు.. వెకిలిగా నవ్వుతూ మాట్లాడారు!: వైసీపీ నేత బుగ్గన

  • జగన్ గుండె నిబ్బరంతో హైదరాబాద్ కు వచ్చారు
  • టీడీపీ నేతల ప్రతిస్పందన దారుణంగా ఉంది
  • గద్ద బొమ్మతో ప్లెక్సీని తయారుచేశారు

వైజాగ్ విమానాశ్రయంలో దాడి జరిగిన తర్వాత జగన్ గుండె నిబ్బరంతో హైదరాబాద్ కు వచ్చి ఆసుపత్రిలో చేరారని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వ ప్రతిస్పందన చూసి చాలా బాధేసిందని వెల్లడించారు. నేతలు గొప్పవారో, కాదో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు. ఈ రోజు హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన మాట్లాడారు.

వైఎస్ జగన్ పై దాడి జరిగిన అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్, కేసీఆర్, కేటీఆర్, కవిత, సీపీఎం, సీపీఐ నేతలు ఆయన్ను పరామర్శించారని తెలిపారు. దీనిపై కూడా చంద్రబాబు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వుతూ మాట్లాడారనీ, దీనివల్ల 3 గంటల సమయం వృథా అయిందంటూ కామెంట్లు చేశారన్నారు. చంద్రబాబు లోపల ఉండే ద్వేషాన్ని ఈ సందర్భంగా బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు.

దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు వైసీపీ అభిమాని అని రెండు గంటల్లోనే రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ ను కాదని నివేదిక ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. జగన్ పై దాడి జరిగితే ఒక్క టీడీపీ నేత కూడా పరామర్శించలేదని మండిపడ్డారు.

విమానాశ్రయంలో రాష్ట్ర పోలీసులకు సంబంధం లేకుంటే ప్రతి ఎయిర్ పోర్ట్ లో పోలీస్ స్టేషన్లను ఎందుకు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. పోలీసులు విడుదల చేసిన లేఖ పేజీ, పేజీకి సంబంధమే లేదని స్పష్టం చేశారు. ప్లెక్సీలో గరుడ బొమ్మను ఏర్పాటు చేశారనీ, దాన్ని సరిగ్గా డిజైన్ చేయడం కూడా టీడీపీ నేతలకు రాలేదని ఎద్దేవా చేశారు.

జగన్ చేతిలోకి కత్తి లోతుగా వెళ్లడంతో లోపల కండకు తొలుత వైద్యులు కుట్లు వేశారనీ, అనంతరం పైన చర్మానికి కూడా కుట్లు వేశారని వెల్లడించారు. ఈ దాడి ఘటనను ఖండించాల్సిన టీడీపీ నేతలు.. దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అధ్వానమైన పరిపాలన దేశంలో ఎవ్వరికీ చేతకాదని ఎద్దేవా చేశారు.

More Telugu News