Andhra Pradesh: ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే జగన్ పై దాడి.. స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబుదే!: వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కౌంటర్

  • ప్రభుత్వ ప్రమేయంతోనే జగన్ పై దాడి
  • నిందితుడి కుటుంబానికి 2 లోన్లు ఇచ్చారు
  • వైఎస్సార్ బొమ్మ లేకుండానే ప్లెక్సీని పెట్టారు

వైజాగ్ ఎయిర్ పోర్ట్ వీఐపీ లాంజ్ లో ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రతిపక్ష నేత జగన్ పై దాడి జరిగేదే కాదని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. విమానాశ్రయంలో పోలీస్ అధికారులకు తెలియకుండా కత్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్ లో క్యాంటీన్ నిర్వహిస్తున్న వ్యక్తి టీడీపీ నాయకుడని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో సిటీ న్యూరో ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

వైఎస్ జగన్ పై దాడి జరిగిన వెంటనే.. ఇది తాము చేయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులతో పాటు సాక్షాత్తూ డీజీపీ సైతం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎప్పుడో 2018, జనవరి 1న జగన్ తో నిందితుడు శ్రీనివాసరావు దిగిన ఫొటో ఉన్న ప్లెక్సీని దాడి జరిగిన రెండు గంటల్లోనే ఓ వర్గం మీడియా ప్రసారం చేసిందని వెల్లడించారు. పసుపు రంగులో ఈ ప్లెక్సీ ఉందనీ, పెద్దాయన వైఎస్సార్ బొమ్మ లేకుండానే దీన్ని తయారుచేశారని విమర్శించారు. ‘ఆపరేషన్ గరుడ’ కుట్రలో భాగంగా జగన్ పై దాడి జరిగిందనీ, దీని వెనుక స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబుదేనని ఆరోపించారు.

గత ఆరు నెలలుగా శ్రీనివాసరావు కుటుంబం టీడీపీలో ఉందనీ, వీరికి రెెండు లోన్లను టీడీపీ ప్రభుత్వం జారీచేసిందని తెలిపారు. శ్రీనివాసరావుకు తప్పుడు ఆశలు చూపి జగన్ పై హత్యాయత్నానికి ఉసిగొల్పారని తెలిపారు. చంద్రబాబుపై 2003లో అలిపిరిలో దాడి జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హుందాగా ప్రవర్తించారని వెల్లడించారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ప్రవర్తన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు.

More Telugu News