Aadhar card: సుప్రీం తీర్పు బేఖాతరు.. సిమ్ కార్డుల కోసం ఇంకా ఆధార్‌ అడుగుతున్న టెల్కోలు

  • టెలికం సేవల కోసం ఆధార్ వద్దన్న సుప్రీం
  • యథేచ్ఛగా ఉపయోగిస్తున్న టెలికం కంపెనీలు
  • ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తామన్న డీవోటీ

ఆధార్ కార్డు అనుసంధానం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును టెలికం కంపెనీలు బేఖాతరు చేస్తున్నాయి. సిమ్ కార్డుల జారీకి ఇప్పటికీ ఆధార్ వివరాలను అడిగి తెలుసుకుంటున్నాయి. ఈకేవైసీ, ఆధార్ బయోమెట్రిక్‌ను ఇప్పటికీ వినియోగిస్తున్నట్టు  టెలికం కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. సిమ్ కార్డుల జారీకి దీనినే అథెంటికేషన్‌గా ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.

 సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి టెలికం కంపెనీలు ఇంకా ఆధార్‌తో అనుసంధానం చేయడంపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డీవోటీ) దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొంది.

అక్టోబరు 1న సుప్రీంకోర్టు ఆధార్ అనుసంధానంపై తీర్పు ఇస్తూ.. వివిధ రకాల టెలికం సేవల కోసం ఆధార్‌ను ఉపయోగించవద్దని తీర్పు చెప్పింది. ఆధార్ అథెంటిఫికేషన్ నిలుపుదల చేయడానికి సంబంధించిన ప్రణాళికను ఈనెల 15లోగా అందించాలని ఆదేశించింది.

కాగా, యూఐడీఏఐ ఫిర్యాదుపై డీవోటీ స్పందించింది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపింది. ఆధార్ ఈకేవైసీ నిలుపుదలకు సంబంధించి నిబంధనలను త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఆధార్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించనున్నట్టు వివరించింది.

More Telugu News