Supreme Court: ఆరావళి ప్రాంతంలోని 31 కొండలు మాయం... షాకైన సుప్రీంకోర్టు

  • అక్రమ మైనింగ్ కారణంగా మాయమైన కొండలు
  • 48 గంటల్లో అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలి
  • కొండలు మాయమవడంపై సుప్రీంకోర్టు సీరియస్

అక్రమ మైనింగ్ కారణంగా రాజస్థాన్‌లోని ఆరావళి ప్రాంతంలోని 31 కొండలు మాయమైపోయాయి. విషయం తెలుసుకున్న దేశ సర్వోన్నత న్యాయస్థానం షాక్ అయ్యింది. రాజస్థాన్‌ ప్రభుత్వం తమకు సమర్పించిన నివేదిక, కేంద్రీయ సాధికారత సంస్థ (సీఈసీ) అందించిన వివరాలను పరిశీలించిన మీదట 48 గంటల్లో అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ మదన్‌ బీ లోకుర్‌, దీపక్‌ గుప్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు కొండలు మాయమవడంపై సీరియస్ అయింది.

గనుల తవ్వకాల వల్ల రాజస్థాన్‌కి రూ.5000 కోట్ల రాయల్టీ వస్తున్న మాట వాస్తవమేనని.. కానీ దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకోవడానికి ఆ కొండలు మాయమవడమే కారణమని తెలిపింది. కొండలు ఇలాగే మాయమైతే దేశ పరిస్థితి ఏంటని రాజస్థాన్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదిని జస్టిస్‌ లోకుర్‌ ప్రశ్నించారు. ఆరావళి పరిధిలో అక్రమ మైనింగ్‌ను నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేశారు.

More Telugu News