Amrutasar: ‘అమృత్‌సర్ రైలు ప్రమాదం’ విమర్శలపై స్పందించిన సిద్దూ

  • బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
  • రైలు అంత వేగంగా ఎందుకొచ్చింది?
  • విచారణ జరపకుండా డ్రైవర్‌కు క్లీన్‌చిట్ ఎలా ఇస్తారు?

అమృత్‌సర్ రైలు ప్రమాదానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల విమర్శలపై పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్దూ స్పందించారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటామని, కుటుంబసభ్యుల బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. ఈ దుర్ఘటన కారణంగా అనాథలుగా మారిన పిల్లలను చదివించే బాధ్యత తమదేనన్నారు.

రావణ దహన కార్యక్రమానికి అతిథిగా హాజరయిన సిద్దూ భార్య నవజోత్ కౌర్ సిద్దూపై వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారనడం, కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తి సౌరబ్ మిట్టుతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకుడు విజయ్ మదన్‌కు మద్దతుగా నిలుస్తున్నారనడం సబబు కాదన్నారు. తమ డ్రైవర్, సిబ్బంది ఎలాంటి తప్పు చేయలేదని రైల్వే శాఖ సమర్థిస్తోందని.. ఆ సమయంలో రైలు అంత వేగంగా ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రైలు వేగానికి సంబంధించిన ఓ వీడియోను తన సెల్‌ ఫోన్లో చూపించారు.

విచారణ జరపకుండా డ్రైవర్‌కు ఏవిధంగా క్లీన్‌చిట్ ఇస్తారు? రైలు అంత వేగంతో ఎందుకొచ్చింది? రైల్వే ట్రాక్‌పై వందలాది మంది ఉన్నారని గేట్‌మేన్ ఎందుకు సమాచారం ఇవ్వలేదు? రైలు వేగాన్ని ఎందుకు తగ్గించలేదు? అని సిద్దూ ప్రశ్నించారు. తన భార్యపై చేస్తున్న విమర్శలను ఆక్షేపించారు. ఇదిలావుండగా పంజాబ్ మంత్రిగా కొనసాగుతున్న సిద్దూ రాజీనామా చేయాలని శిరోమణి అకాళీదల్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సిద్దూ భార్యపై హత్య కేసు నమోదు చేయాలని, శిక్ష పడేలా చేయాలని కోరుతున్నారు.

More Telugu News