Chandrababu: కిం కర్తవ్యం... టీటీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పిందిదే!

  • ముగిసిన పొలిట్ బ్యూరో సమావేశం
  • గెలిచే సీట్లను వదులుకోవద్దు
  • పొత్తుల విషయంలో పట్టువిడుపులు
  • నేతలకు చంద్రబాబు సలహా, సూచనలు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ నేతలతో జరిపిన పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాలపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. మహాకూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదన్న అంశంపైనా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. టీడీపీ కచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్న సీట్లను వదులుకోవద్దని, సాధ్యమైనన్ని అధిక స్థానాల్లో పోటీ చేద్దామని చెప్పిన చంద్రబాబు, పొత్తుల విషయంలో పట్టువిడుపులను ప్రదర్శించాలని సూచించారు.

ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తారన్న విషయంపై తాను ప్రత్యేక దృష్టిని సారిస్తానని చెప్పిన ఆయన, ప్రచార సరళిని సమీక్షిస్తానని నేతలకు హామీ ఇచ్చినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో పార్టీ పనితీరు సంతృప్తికరంగా ఉందని, నేతలు ఫిరాయించినా, క్షేత్ర స్థాయిలో క్యాడర్ బలంగా ఉందని చెప్పిన ఆయన, కాంగ్రెస్ తో కలసి ఎన్నికలకు వెళ్లడాన్ని సమర్థించుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై పొలిట్ బ్యూరో సభ్యుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్న ఆయన, మరికాసేపట్లో టికెట్ ను ఆశిస్తున్న ఆశావహులతో సమావేశం కానున్నారు.

More Telugu News