Chandrababu: గత ఎన్నికల్లో చంద్రబాబు గెలుపునకు.. జగన్ ఓటమికి కారణం చెప్పిన కేసీఆర్!

  • చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు
  • జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఓటమి పాలయ్యారు
  • అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనున్న టీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశమైన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఎలా గెలిచిందీ.. జగన్ ఎందుకు ఓడిపోయిందీ చెప్పుకొచ్చారు. నాడు చంద్రబాబు అనుసరించిన విధానాన్ని అనుసరించడం ద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని అభ్యర్థులకు సూచించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం ద్వారా గెలిచారని.. జగన్ అతి విశ్వాసంతో ఓటమి పాలయ్యారని కేసీఆర్ అన్నారు.

నాడు చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేసి విజయం సాధించాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు టీడీపీ హయాంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరినీ పార్టీ నేతలు కలిశారని, తొలి గంటలోనే వారిని పోలింగ్ బూత్  కు తీసుకురావడంలో సఫలం అయ్యారని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీ శిబిరాలపై కన్నేశారని వివరించారు. వారందరినీ బూత్‌కు రప్పించడం వల్లే టీడీపీ విజయం సాధించగలిగిందని, ఇప్పుడు అదే వ్యూహాన్ని మీరూ అనుసరించాలంటూ అభ్యర్థులకు సూచించారు. జగన్‌లా అతి విశ్వాసం ప్రదర్శించవద్దని, నిర్లక్ష్యాన్ని వీడి ముందుకు సాగాలని అభ్యర్థులను కేసీఆర్ హెచ్చరించారు.

More Telugu News