Virat Kohli: కోహ్లీ సెంచరీ.. శతకం దిశగా రోహిత్.. దీటుగా బదులిస్తున్న టీమిండియా

  • వన్డేల్లో 36వ సెంచరీ చేసిన కోహ్లీ
  • 79 పరుగులతో ఆడుతున్న రోహిత్
  • ఇండియా స్కోరు వికెట్ నష్టానికి 198 పరుగులు

గువాహటిలో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ కు టీమిండియా దీటుగా బదులిస్తోంది. విండీస్ విసిరిన 323 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఇండియా బ్యాటింగ్ ప్రారంభమైన వెంటనే జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ (4) థామస్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మకు కోహ్లీ జత కలిశాడు. వీరిద్దరూ ఎలాంటి పొరపాట్లు చేయకుండా విండీస్ బౌలర్లను దూకుడుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లీ తన శతకాన్ని పూర్తి చేసుకోగా, రోహిత్ అర్ధశతకాన్ని నమోదు చేశాడు.

97 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ రోచ్ బౌలింగ్ లో డీప్ ఎక్స్ ట్రా కవర్ మీద ఫోర్ కొట్టి సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో తన వన్డే కెరీర్ లో 36వ శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న రెండు బంతులను కూడా కోహ్లీ బౌండరీకి తరలించాడు. ప్రస్తుతం కోహ్లీ 110 పరుగులు, రోహిత్ 79 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 28 ఓవర్లలో 198 పరుగులు. ఇండియా గెలవాలంటే మరో 125 పరుగులు సాధించాల్సి ఉంది. 

More Telugu News