laskare toyiba: భారత్‌పై భీకర దాడులతో అలజడి సృష్టిస్తాం!: లష్కరే తోయిబా

  • అక్టోబరు 20, నవంబరు 9వ తేదీల్లో చేస్తామని ప్రకటన
  • 20వ తేదీ గడిచిపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం
  • 9వ తేదీ కోసం అప్రమత్తమైన అధికార యంత్రాంగం

భారత్‌పై భీకర దాడులు చేసి అలజడి సృష్టిస్తామని పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఇటీవల ప్రకటించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దేశంలోని గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అలజడులు సృష్టిస్తామని లష్కరే ఏరియా కమాండర్‌ మౌల్వి అబుషేక్‌ రావల్సిండి నుంచి హెచ్చరించారు. ఇందుకోసం ఈ సంస్థ అక్టోబరు 20, నవంబరు 9వ తేదీలను ప్రకటించింది.

ఇప్పుడు అక్టోబరు 20వ తేదీ గడిచిపోవడం, ఎటువంటి దాడులు జరగకపోవడంతో భద్రతా సిబ్బందితోపాటు ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే నవంబరు 9వ తేదీన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా సిబ్బంది గట్టి నిఘా ఏర్పాటు చేశారని హిందుస్థాన్‌ టైమ్స్‌ పేర్కొంది.

మధ్యప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్లను ఈ ఉగ్రవాద సంస్థ టార్గెట్‌ చేసిందన్న వార్తల నేపథ్యంలో భోపాల్‌, గ్వాలియర్‌, కట్ని, జబల్‌పూర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు.

More Telugu News