Rahul Gandhi: సిగ్గులేని రాహుల్ గాంధీ... ఏపీ స్క్రిప్టు ఇక్కడ చదివారు: కేటీఆర్ నిప్పులు

  • రైతుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీయే
  • విమర్శలకు ఆధారాలను చూపించగలరా?
  • రాహుల్ ప్రసంగాలపై మండిపడ్డ కేటీఆర్

తెలంగాణకు వచ్చి పచ్చి అబద్ధాలను చెబుతున్న రాహుల్ గాంధీ ఓ సిగ్గులేని వ్యక్తని టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ మండిపడ్డారు. శనివారం నాడు భైంసా, కామారెడ్డి, చార్మినార్ సభల్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలపై స్పందించిన ఆయన, ఏపీ ఎన్నికల కోసం రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్ ఇక్కడ చదివారని, ఆయన మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణమన్న కేటీఆర్, 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు వల్లే ప్రాజెక్టుల వ్యయం పెరిగిందని అన్నారు. కాళేశ్వరంపై చేస్తున్న విమర్శలకు ఆధారాలను చూపించాలని సవాల్ విసిరారు.

చంద్రబాబుకు ఉన్న జబ్బు రాహుల్ కు అంటినట్టుగా తాను భావిస్తున్నానని, తెలంగాణలో నీళ్లు, నియామకాల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని అన్నారు. ఎస్సారెస్పీ పనులను సకాలంలో పూర్తి చేసి, తెలంగాణ రైతులకు సాగునీరు ఇచ్చుంటే ఆత్మహత్యలు జరిగేవా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత 87 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఇప్పటికే 32 వేల ఉద్యోగాల భర్తీ పూర్తయిందని చెప్పిన ఆయన, ఈ విషయంలో ఏపీలో మాట్లాడాల్సిన మాటలను ఆయన తెలంగాణలో మాట్లాడారని నిప్పులు చెరిగారు.

తమకు ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమేనని, ఉనికిలేని బీజేపీ, క్యాడర్ లేని టీడీపీలు తమకు పోటీ కాదని కేటీఆర్ అన్నారు. ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామని తాము ఎన్నడూ హామీ ఇవ్వలేదని గుర్తు చేసిన ఆయన, కోర్టులో కేసుల వల్లే ఉద్యోగాలకు అడ్డంకులు ఏర్పడ్డాయని అన్నారు. రాష్ట్రంలో సోదరులుగా మెలుగుతున్న హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

More Telugu News