bunni: ముగిసిన బన్ని ఉత్సవాలు.. దేవరగట్టు కర్రల సమరంలో 35 మందికి తీవ్రగాయాలు!

  • క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం
  • కర్నూలులో దేవరగట్టు కర్రల సమరం
  • ప్రాణనష్టం జరగనందుకు ఊపిరిపీల్చుకున్న పోలీసులు 

కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో మరోసారి రక్తం చిందింది. అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా ఈ ఏడాది జరిగిన బన్ని ఉత్సవాల్లో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దేవరగట్టులో ప్రతిఏటా విజయదశమి రోజున కర్రల సమరం జరపడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా ఇక్కడి మాళమ్మ, మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. విగ్రహాలు దక్కించుకునేందుకు ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోటీపడుతూ పరస్పరం కర్రలతో దాడిచేసుకుంటారు. ఇందులో భాగంగా తొలుత మాళమ్మ మల్లేశ్వరస్వామికి రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్న గుడి ప్రాంతాల్లో దివిటీల వెలుగులో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.

ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో దాడిచేసుకున్నారు. ఈ ఘటనలో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆదోనీ, ఆలూరులోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.

కాగా, ఈ ఉత్సవాల్లో గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బన్ని ఉత్సవాల సందర్భంగా హింసను నివారించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకుండానే దేవరగట్టు సమరం ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News