Jagan: మేం ప్రతిపక్షంలో వున్నప్పుడు 670 మంది కార్యకర్తలను చంపేశారు.. అయినా కేడర్ చెక్కుచెదరలేదు!: ఏపీ మంత్రి లోకేశ్

  • పరిటాల రవిని టీడీపీ ఆఫీసులోనే హత్యచేశారు
  • అవినీతి కేసుల్లో నిందితుడు జగన్ నాపై విమర్శలు చేస్తున్నారు
  • దమ్ముంటే ఆరోపణలను నిరూపించాలి

అధికార పార్టీ నేతలు హింసించి చంపినా కార్యకర్తలు టీడీపీ జెండాను వదలలేదని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీని ప్రారంభించారో గానీ, ఏ పార్టీకీ లభించనంత గొప్ప కేడర్ టీడీపీకి లభించిందని ఆయన కితాబిచ్చారు. తాము ప్రతిపక్షంలో ఉండగా అధికార పార్టీ నేతలు 670 మంది టీడీపీ కార్యకర్తలను చంపేశారనీ, మాజీ మంత్రి పరిటాల రవిని టీడీపీ ఆఫీసులోనే దారుణంగా హత్య చేశారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడలోని ఆటోనగర్ లో పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి లోకేశ్ శంకుస్థాపన చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఎంతగా హింసించినా, చంపేసినా కార్యకర్తలు టీడీపీ జెండాను వీడలేదని తెలిపారు. అనేక అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. దమ్ముంటే వాటిని నిరూపించాలని సవాలు విసిరారు. పక్క జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పటికీ తుపాను ప్రభావిత ప్రాంతాలను పట్టించుకునే తీరిక జగన్ కు లేదని మంత్రి ఎద్దేవా చేశారు. తుపాను వచ్చిన 7 రోజుల తర్వాత పవన్ శ్రీకాకుళం జిల్లాకు వచ్చి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ కార్యకర్తలను ఆదుకునేందుకు కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశామనీ, 3,000 కుటుంబాలను ఆదుకున్నామని లోకేశ్ తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.22 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.

More Telugu News