BJP: బీజేపీ సీనియర్ నేత బోలా సింగ్ మృతి..50 ఏళ్లు చట్టసభల్లోనే గడిపిన నేత!

  • అనారోగ్యంతో బాధపడుతున్న సింగ్
  • ఢిల్లీలోని లోహియా ఆసుపత్రిలో కన్నుమూత
  • సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు బోలా సింగ్(80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై బిహార్ లోని బెగుసరయ్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.

బిహార్‌లోని బెగుసరయ్ జిల్లా కేంద్రంలో 1939లో బోలాసింగ్ జన్మించారు. పట్నా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. 1967లో సీపీఐ మద్దతుతో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సింగ్ ఆ తర్వాత పార్టీ అధిష్ఠానంతో విభేదించి లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీలో చేరారు.

2000లో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై పోటీచేసి గెలుపొందారు. అనంతరం 2000 నుంచి 2005 వరకూ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. ఆయన ఇప్పటివరకూ 8 సార్లు శాసన సభ్యుడిగా, రెండు సార్లు లోక్ సభ సభ్యుడిగా పనిచేశారు. కాగా, బోలా సింగ్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

More Telugu News