Andhra Pradesh: తిరుమలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం.. ఏకంగా 16,000 లడ్డూలు నొక్కేసిన వైనం!

  • తనిఖీల్లో గుర్తించిన ఆలయ సిబ్బంది
  • విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు
  • రద్దీని అవకాశంగా మలచుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

తిరుమల, తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేతివాటం చూపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఇచ్చిన మినహాయింపును దుర్వినియోగం చేశారు. భక్తులకు ఇవ్వాల్సిన 16,000 ఉచిత లడ్డూలను నొక్కేశారు. ఈ వ్యవహారాన్ని తొలుత గుర్తించిన అధికారులు విజిలెన్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

సాధారణంగా శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం భక్తులకు ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి ప్రసాదంగా రెండు ఉచిత లడ్డూలను అందజేస్తారు. అయితే ఇటీవల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు టోకెన్లను స్కానింగ్ చేయకుండానే లడ్డూలను అందజేయాలని ఉన్నతాధికారులు కౌంటర్లలో ఉన్న సిబ్బందిని ఆదేశించారు.

దీన్ని ఆసరాగా తీసుకున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది అందరూ కుమ్మక్కై 16,000 లడ్డూలు నొక్కేశారు. చివరికి తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడటంతో ఆలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News