Foreign Tour: క్రికెటర్లకు ఇంకా ఆ అవకాశం ఇవ్వలేదు: బీసీసీఐ

  • విదేశీ పర్యటనల్లో క్రికెటర్ల భార్యలను పంపుతున్నారని వార్తలు
  • ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదన్న డయానా ఎదుల్జీ
  • భాగస్వాములు ఉంటే ఆట బాగుంటుందని సోషల్ మీడియాలో ప్రచారం

విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో క్రికెటర్లు తమ భార్యలు, స్నేహితురాళ్లను తీసుకెళ్లేందుకు అనుమతించినట్టు వచ్చిన వార్తలపై బీసీసీఐ స్పందించింది. ఈ విషయంలో ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు భాగస్వామిని తీసుకు వెళ్లే విషయంలో మరింతమంది అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీసీసీఐ పాలక కమిటీ సభ్యురాలు డయానా ఎదుల్జీ వెల్లడించారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం పడుతుందని ఆమె తెలిపారు.

కాగా, ఫారిన్ టూర్ కు వెళ్లినప్పుడు, భాగస్వాములు రెండు వారాలు మాత్రమే తమతో ఉంటున్నారని, ఈ సమయాన్ని పెంచాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ పెద్దలను కోరిన సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ చర్చను ప్రారంభించగా, టూర్ ప్రారంభమైన తొలి పది రోజుల తరువాత క్రికెటర్ల భార్యలు వారితో ఉండవచ్చని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు నిన్న వార్తలు వెలువడ్డాయి. భార్యలు ఉంటే సానుకూల వాతావరణం ఏర్పడి మరింతగా ప్రదర్శన బయటకు వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కూడా సాగింది. దీనిపై స్పందించిన డయానా, ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని వెల్లడించడం గమనార్హం.

More Telugu News