Facebook: 'ఫేస్ బుక్' చైర్మన్ పదవి నుంచి జుకర్ బర్గ్ తొలగింపుకి ప్రతిపాదన!

  • కలకలం రేపిన తప్పుడు వార్తలు, సమాచార తస్కరణ
  • మార్క్ జుకర్ బర్గ్ ను తప్పిస్తేనే పరువు నిలుస్తుంది
  • ప్రతిపాదించిన నాలుగు పబ్లిక్ ఫండ్ సంస్థలు

తప్పుడు వార్తల కలకలం, వినియోగదారుల సమాచార తస్కరణ తదితర అంశాలు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పదవికి ఎసరు తెచ్చాయి. ఫేస్ బుక్ ఐఎన్సీలో మెజారిటీ షేర్లను కలిగున్న నాలుగు యూఎస్ ఫబ్లిక్ ఫండ్ సంస్థలు తొలిసారిగా ఆయన్ను తొలగించాల్సిందేనన్న ప్రతిపాదన చేశాయి. ఇక సంస్థ అసెట్ మేనేజర్లు కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చేస్తే, మార్క్ తొలగింపు ఖాయమైనట్టే.

ఇల్లినాయిస్‌‌, రోడ్ ఐలండ్, పెన్సిల్వేనియాలకు చెందిన స్టేట్‌ ట్రెజర్స్, న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ స్కాట్ స్ట్రింగర్ ఫండ్స్ సంస్థలు మార్క్ ను తీసివేయాలని, ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని డిమాండ్ చేశాయి. డేటా తస్కరణ, కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణం నుంచి సంస్థను బయటపడేయాలంటే, మార్క్ జుకర్ బర్గ్ ను తప్పించడమే ఉత్తమమని రోడ్ ఐలండ్ స్టేట్ ట్రెజర్స్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. వచ్చే వార్షిక సమావేశంలో దీనిపై చర్చిస్తామని సంస్థ చీఫ్ సేథ్ మాగజైనర్ వ్యాఖ్యానించారు.

కాగా, ఫేస్ బుక్ తదుపరి సర్వసభ్య సమావేశం 2019 మేలో జరుగనుండగా, ఇండిపెండెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అత్యధిక మార్కెట్ వాటాను కలిగివున్న ఫేస్ బుక్ ఈక్విటీ ఈ వార్తలతో 10 శాతం పడిపోయింది. అయితే, జుకర్ బర్గ్ కు 60 శాతం ఓటింగ్ హక్కు ఉండటంతో ఆయన తొలగింపు అంత సులువేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

More Telugu News