Telangana: తెల్లవారి లేస్తే వీహెచ్ హెరిటేజ్ పాలే తాగుతారు!: టీఆర్ఎస్ నేత వినోద్ ఎద్దేవా

  • కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదలే చేయలేదు
  • మేమెలా దాన్ని కాపీ కొడతాం
  • పాడిపరిశ్రమ అభివృద్ధికి కట్టుబడ్డాం

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను టీఆర్ఎస్ కాపీ కొట్టిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ ఖండించారు. ఉత్తమ్ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేనిఫెస్టోను విడుదల చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వినోద్ మాట్లాడారు.

ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ బర్రెలు, గొర్రెలు ఇస్తుందా? అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వేసిన ప్రశ్నకు వినోద్ స్పందించారు. తెలంగాణ ప్రజలకు తప్పకుండా గొర్రెలు, పశువులను అందజేస్తామని, పాడిపరిశ్రమను అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. పాడి పరిశ్రమపై ఆధారపడ్డ ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

వీహెచ్ తెల్లవారి లేస్తే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ పాలు, బెంగళూరుకు చెందిన నంది పాలు తాగుతారని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు, పాడిపరిశ్రమ ద్వారా స్థానికులకు లబ్ధి చేకూర్చేందుకే పశువులను అర్హులకు అందజేస్తున్నామని తెలిపారు. రూ.200 పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రూ.2వేలు ఇస్తారా? అంటూ ప్రజలు నవ్వుతున్నారని వినోద్ అన్నారు.

More Telugu News