Oil: చమురు కంపెనీలకు నరేంద్ర మోదీ విన్నపం... అంత సీను లేదన్న సౌదీ అరేబియా!

  • నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలు
  • చెల్లింపులను స్థానిక కరెన్సీలో తీసుకోవాలని మోదీ సూచన
  • అది కుదిరే పని కాదన్న సౌదీ అరేబియా

అధిక ఇంధన ధరలు ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిని ప్రమాదంలో పడేస్తున్నాయని, చెల్లింపుల విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై సౌదీ అరేబియా నుంచి వ్యతిరేక స్పందన వచ్చింది. క్రూడాయిల్ ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి ఖలీద్ ఏ అల్ ఫలీహ్ వ్యాఖ్యానించారు. ప్రపంచానికి చాలినంత క్రూడాయిల్ ఉత్పత్తిని కొనసాగించేందుకు అభ్యంతరం లేదని చెప్పిన ఆయన, ధరల విషయంలో మాత్రం తాము చేయగలిగిందేమీ లేదని, భారత విన్నపాన్ని మన్నించలేమని అన్నారు. తమబోటి వారిపై బయటి నుంచి ఎన్నో వత్తిళ్లు వస్తున్నాయని, తాము కావాలంటే సరఫరాను మాత్రం నియంత్రించగలమని తేల్చి చెప్పారు.

కాగా, డాలర్‌ తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పతనంకాగా, ఇతర దేశాల కరెన్సీల విలువ కూడా క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. చమురు దిగుమతి చేసుకునే దేశాలు జరిపే చెల్లింపులు డాలర్లలో కాకుండా, ఆయా దేశాల స్థానిక కరెన్సీ రూపంలో తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సౌదీ, చెల్లింపులను ఆయా దేశాల కరెన్సీల రూపంలో తీసుకోవాలన్న ఆలోచన తమకు ఏ మాత్రం లేదని, ఏదైనా చమురు ఉత్పత్తి దేశం అందుకు అంగీకరిస్తే తమకు అభ్యంతరం లేదని వెల్లడించింది.

More Telugu News