Hyderabad: వేగం పెంచి, చెవులు పగిలేలా సౌండ్ పెట్టి, మహిళను భయభ్రాంతులకు గురిచేసిన ఆటో డ్రైవర్.. ఐదు రోజుల జైలు శిక్ష!

  • బోరబండలో ఘటన
  • భయభ్రాంతులకు గురైన మహిళ
  • పోలీసులకు ఫిర్యాదు
తన ఆటో ఎక్కిన మహిళను భయభ్రాంతులకు గురిచేసిన డ్రైవర్‌కు నాంపల్లిలోని 10వ మెట్రోపాలిటన్ కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. బోరబండ పోలీసుల కథనం ప్రకారం.. సయ్యద్‌నగర్‌కు చెందిన బషీర్ ఆటో డ్రైవర్. మూడు రోజుల క్రితం బోరబండ బస్టాండ్ వద్ద ఓ మహిళను ఎక్కించుకున్న బషీర్ అత్యంత వేగంగా ఆటో నడిపాడు.

దాంతో భయభ్రాంతులకు గురైన ఆమె నెమ్మదిగా వెళ్లాలని కోరినప్పటికీ అతడు వినిపించుకోలేదు సరికదా, తాగిన మత్తులో మరింత వేగంగా పోనిచ్చాడు. అంతేకాక, చెవులు పగిలేలా సౌండ్ పెట్టాడు. ఈ క్రమంలో ఓ చోట ఆటో ఆగడంతో వెంటనే కిందికి దిగిన ఆమె స్థానికుల సహకారంతో బోరబండ ఔట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బషీర్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడికి ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
Hyderabad
Auto driver
Borabanda
Nampally court

More Telugu News