Andhra Pradesh: తిత్లీ విధ్వంసం.. శ్రీకాకుళం జిల్లా మందసలో పర్యటించిన మంత్రి లోకేశ్!

  • ఆదుకుంటామని ప్రజలకు హామీ
  • సాయంత్రంకల్లా నిత్యావసరాలు అందజేయాలని ఆదేశం
  • ఒక్కో కుటుంబానికి 25 కేజీలు అందిస్తామని వెల్లడి

తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దీని తీవ్రతకు చాలావరకూ పంటలు ధ్వంసం కాగా, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా జిల్లాలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేశ్ ఈ రోజు మందసను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు నుంచి రేషన్‌ దుకాణాల్లో ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇస్తామని మంత్రి తెలిపారు. రేషన్ సరుకుల్లో భాగంగా ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, లీటర్ నూనె, అర కిలో చక్కెర అందజేస్తామన్నారు.

ఈ రోజు సాయంత్రం కల్లా రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసరాలు చేరవేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో భోజన సదుపాయం కొనసాగించాలనీ, తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని మంత్రి అన్నారు. బాధితులను ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు.

More Telugu News