Tirumala: గరుత్మంతునిపై విహరించే శ్రీవారికి ఎన్ని ప్రత్యేకతలో..!

  • నేడు ఉదయం మోహినీ అవతారం, రాత్రికి గరుడసేవ
  • మూల విరాట్టుకు అలంకరించే ఆభరణాలతో మలయప్పస్వామి
  • తిరుమలకు లక్షలాదిగా చేరుకుంటున్న భక్తులు

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం... అందులోనూ ఐదో రోజున జరిగే గరుడోత్సవం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు స్వయంగా జరిపిస్తాడని చెప్పుకునే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు ఉన్న ప్రాశస్త్యం చాలా గొప్పది. తనకెంతో ఇష్టమైన గరుడ వాహనాన్ని అధిరోహించి తిరుగాడుతున్న స్వామిని చూసేందుకు రెండు కనులూ చాలవు. తిరుమాడవీధుల్లో దేవదేవుని చూసి తరించాలని, ఎన్నో వ్యయప్రయాసలతో వచ్చిన లక్షలాది మంది భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి.

గరుడ వాహనం రోజున స్వామివారికి చేసే అలంకరణలకు విశేషమైన ప్రాధాన్యం ఉంటుంది. గర్భగుడిలోని మూలవిరాట్టుకు అలంకరించే ఆభరణాలను ఆయన ఉత్సవ విగ్రహానికి అలంకరించి, గరుడుపై ఊరేగిస్తారు. విశేష ఆభరణాలతో అలంకృతుడై, గజమాలలు, శ్రీవల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన మాలలను ధరింపజేసిన స్వామి వారు భక్తులను కరుణించనున్నారు. గర్భాలయంలో మూలవరులకు అలంకరించే చతుర్భుజ లక్ష్మీహారం, ఐదు పేటల సహస్రనామం, మకరకంఠి అనే పేరిట ఉండే ప్రాచీన మూడుపేటల తిరువాభరణాలు తదితరాలను స్వామివారికి అలంకరించనున్నారు.

కాగా, గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సమస్త వాహనాలలో సర్వ శ్రేష్టమైన గరుడవాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గప్రాప్తి కలుగుతుందని, ఇహపరమైన ఈతిబాధల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. గరుడవాహన సేవ రోజున తిరుమలలో ఆకాశంలో గరుడపక్షుల సంచారం మరో అద్భుతం. గరుడసేవ జరిగే సమయానికి గాల్లో గద్దలు తిరుగుతూ కనిపించడం గమనార్హం. మిగతా ఏ సేవ రోజూ కూడా ఈ పక్షులు కనిపించవు. అందుకే గరుడోత్సవానికి అంతటి ఘనమైన ప్రాధాన్యముంది.

More Telugu News