Andhra Pradesh: తిత్లీ తుపాను సహాయక పనులకు.. రంగంలోకి 100 మంది డిప్యూటీ కలెక్టర్లను దించిన చంద్రబాబు!

  • ప్రతి మండలానికి ఓ ఐఏఎస్ అధికారి నియామకం
  • 4 వేల విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ
  • సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం

శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడ్డ తిత్లీ తుపాను దెబ్బకు స్థానికులు అల్లాడుతున్నారు. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం తాకిడికి పంటపొలాలన్నీ ధ్వంసం కాగా, నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఇక్కడి ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధితులు తాగు నీరు దొరక్క తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మంచినీరు, నిత్యావసరాలు జిల్లాలోని సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. చాలాచోట్ల రోడ్లపై నీళ్లు ప్రవహిస్తూ ఉండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రానికి చెందిన 20 విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

కాగా, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ తాను ఇక్కడే ఉంటానని సీఎం ప్రకటించారు. రోడ్లను వెంటనే క్లియర్ చేయాలనీ, విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తాజాగా సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఓ ఐఏఎస్ అధికారిని సీఎం నియమించారు.

క్షేతస్థాయిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాదాపు 100 మంది డిప్యూటీ కలెక్టర్లను చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు పంపారు. జిల్లాలో 12,000 విద్యుత్ స్తంభాలు కూలిపోగా, అధికారులు ఇప్పటివరకూ 4 వేల స్తంభాలను పునరుద్ధరించారు. మరోవైపు తుపాను తాకిడికి నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, పేదలకు 25 కేజీల బియ్యంతో పాటు కిలో చక్కెర, లీటర్ వంటనూనె, కిలో కందిపప్పు, కిలో ఆలూ అందించాలని నిర్ణయించారు.

More Telugu News