India: ఖరీదుగా మారనున్న విదేశీ స్మార్ట్ ఫోన్లు.. సుంకాలను పెంచిన కేంద్రం!

  • కరెంట్ అకౌంట్ లోటుపై కేంద్రం దృష్టి
  • స్మార్ట్ ఫోన్లు, వాచ్ లు మరింత ప్రియం
  • నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్థికశాఖ

ఓవైపు అంతకంతకూ రూపాయి విలువ పడిపోతున్న వేళ కేంద్రం నష్ట నివారణ చర్యలకు దిగింది. కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించడంలో భాగంగా దిగుమతి చేసుకుంటున్న కొన్నిరకాల వస్తువులపై సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుందని ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ బోర్డు తెలిపింది. తాజా పెంపుతో విదేశీ స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే ఓసారి ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రం 15 రోజులు కూడా గడవకుండానే మరోసారి ప్రజలపై భారం మోపింది.

తాజా నిర్ణయం ప్రకారం 17 రకాల వస్తువుల దిగుమతిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. వీటిలో స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ ఫోన్లలో వాడే బ్యాటరీలు, చార్జర్లు,ఇతర పరికరాలపై 10 శాతం సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రింటర్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ వంటి కమ్యూనికేషన్ పరిశ్రమలో వాడే కొన్ని పరికరాలపై ప్రస్తుతమున్న 10 శాతం సుంకాన్ని 20 శాతానికి పెంచుతున్నట్లు నోటిఫికేషన్ ను కేంద్ర ఆర్థికశాఖ జారీచేసింది.

తాజా నిర్ణయంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ఆరుసార్లు దిగుమతి సుంకాన్ని పెంచినట్లయింది. కరెంట్ అకౌంట్ లోటును తగ్గించే చర్యల్లో భాగంగా కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాలను విధిస్తామని గత నెలలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  పేర్కొన్నారు. ప్రస్తుతం డాలర్ తో రూపాయి విలువ రూ.73.68కి చేరుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News