Amith Shah: దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వలేదు: అమిత్ షా ధ్వజం

  • లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు
  • అటెండర్ ఉద్యోగం కూడా భర్తీ చెయ్యలేదు
  • డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు
  • 5 వేల గృహ నిర్మాణం కూడా జరగలేదు
  • 800 అమరుల కుటుంబాలు వేచి చూస్తున్నాయి

దళితులకు మూడెకరాల స్థలం ఇస్తానని వాగ్దానం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వలేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. ఎన్నో వాగ్దానాలు చేసి విస్మరించిన కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని దుయ్యబట్టారు. కరీంనగర్‌లో జరిగిన బీజేపీ తొలి ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడారు.

‘‘వరుస వాగ్దానాలు చేసిన కేసీఆర్ గారు దళిత వ్యక్తిని సీఎంని చేయడమే కాదు.. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. 7 లక్షల దళిత కుటుంబాలున్నాయి. వాళ్లకు సూది మోపినంత స్థలం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గత 4 సంవత్సరాల్లో ఇవ్వలేదు. ఉపాధి విషయంలోనూ లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఉపాధ్యాయ, డాక్టర్ కనీసం అటెండర్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. నేడు తెలంగాణలో రెండు లక్షలకు పైగా ఖాళీలున్నాయి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.


బీద, బడుగు వర్గాల కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ నేటి వరకూ 5 వేల గృహ నిర్మాణం కూడా జరగలేదు. పైగా ప్రధాని మోదీ పంపించిన డబ్బును కూడా ఖర్చు చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1200 మంది కుటుంబాలకు ఉద్యోగాలిస్తానన్నారు. నేటికీ 800 అమరుల కుటుంబాలు వేచి చూస్తున్నాయి. వారిని ఘోరంగా మోసం చేశారు. నేడు ఎన్నికల బరిలోకి వస్తే అమరుల కుటుంబాలు, తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెబుతారు. నాలుగు సంవత్సరాల్లో ఒక్క అధ్యాపక పోస్టు కూడా ఈ రాష్ట్రంలో భర్తీ కాలేదు. దీని కారణంగా విద్యార్థులు ఒకరికొకరు బోధన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News