Bihar: వెళ్లిపోకండి.. మీ భద్రత భరోసా మాది!: బీహార్, ఉత్తరప్రదేశ్ వలసజీవులకు గుజరాత్ మంత్రి విజ్ఞప్తి

  • 450 మంది నిందితుల అరెస్ట్, ఎఫ్ఐర్ నమోదు
  • పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపించిన గుజరాత్
  • గుజరాత్ ముఖ్యమంత్రికి బీహార్ ముఖ్యమంత్రి ఫోన్

దాడుల నేపథ్యంలో గుజరాత్ నుంచి స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న బీహార్, ఉత్తరప్రదేశ్ వలసజీవులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన భద్రత కల్పించే బాధ్యత తమదని గుజరాత్ హోంశాఖ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా వలసజీవులకు భరోసా ఇచ్చారు. 14 నెలల చిన్నారిపై అత్యాచార ఉదంతం అనంతరం స్థానికేతరులపై జరుగుతున్న దాడులతో భయపడుతున్న ఉత్తరప్రదేశ్, బీహార్ వలసవాసులు పెద్ద సంఖ్యలో తమ స్వస్థలాలకు తిరుగు పయనమవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై స్పందించిన మంత్రి ఈ ప్రకటన చేశారు.

గుజరాత్ లోని మెహ్ సన, సబర్ కాంత్ జిల్లాలలో అధికంగా జరుగుతున్న ఈ దాడులను ఆయన ఖండించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత తమదేనని, రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంపైనే దృష్టి పెట్టామని, ఇప్పటికే 450 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకుని, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని మంత్రి వెల్లడించారు. ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపించామని తెలిపారు. భద్రత, గస్తీ పెంచామని తెలిపారు.

ఇక ఇదే విషయంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా స్పందించారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ రూపానీకి ఫోన్ చేసి, వలసవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. 'నేరం చేసిన వారిని శిక్షించండి. అంతేకానీ, నేరానికి సంబంధం లేని వారిని శిక్షించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే, ఇతరులపై విద్వేషాలను రెచ్చగొట్టకండి' అంటూ రూపానీతో నితీశ్ చెప్పినట్టు తెలుస్తోంది.  

ఇదిలావుండగా సెప్టెంబర్ 28న 14 నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత గుజరాత్ లోని ఆరు జిల్లాలు గాంధీనగర్, అహ్మదాబాద్, పఠాన్, సబర్ కాంత్ మరియు మెహ్ సనా జిల్లాలో నివాసముంటున్న బీహార్, ఉత్తరప్రదేశ్ వలసజీవులపై స్థానికులు దాడులు చేస్తున్నారు. ఈ దాడులకు భయపడిన వలసజీవులు స్వస్థలాలకు తిరిగి వెళుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News