BJP: కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ.. షాక్ ఇచ్చిన టీఎంసీ!

  • బీఎస్పీ బాటలోనే టీఎంసీ
  • కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేదిలేదన్న చందన్ మిత్రా
  • ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేసే అవసరం లేదు

బీజేపీని ఎదుర్కొనేందుకు మహాకూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు రోజురోజుకూ ఆవిరవుతున్నాయి. బీఎస్పీ బాటలోనే టీఎంసీ కూడా నడుస్తూ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. ఇప్పటికే బహుజన్ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. నేడు పశ్చిమ్‌బెంగాల్ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ కూడా అటువంటి ప్రకటనే చేసి కాంగ్రెస్‌కి షాక్‌ ఇచ్చింది.

ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న టీఎంసీ నేత చందన్‌ మిత్రా... తాము పశ్చిమ్‌బెంగాల్ లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ-షా, ఆర్‌ఎస్‌ఎస్‌కి వ్యతిరేకంగా బరిలోకి దిగడానికి మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తారా? అన్న ప్రశ్నకు చందన్‌ మిత్రా సమాధానం ఇస్తూ...  ‘పశ్చిమ్‌ బంగాలో భాజపా, వామపక్ష పార్టీలకు వ్యతిరేక శక్తిగా మమతా బెనర్జీ మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేసే అవసరం ఆమెకు లేదని అనుకుంటున్నాను’ అని అన్నారు. ఈసారి పశ్చిమ్ బెంగాల్ లో అత్యధిక సీట్లు సాధించాలని భావిస్తున్న బీజేపీకి ఇది కలిసొచ్చే అంశంగా పరిణమిస్తోంది.

More Telugu News