Telangana: ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియాపై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు : కొండా సురేఖ

  • రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది
  • ఓడిపోతామన్న భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు
  • టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి ఏళ్లనాటి రాష్ట్ర ప్రజల కలను నెరవేర్చిన సోనియా గాంధీపై కేటీఆర్‌ నోరు పారేసుకోవడం సిగ్గుచేటని వరంగల్‌ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మూడో డివిజన్‌ ధర్మారంలో పరకాల నియోజకవర్గం పాస్టర్ల సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు.

తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో సోనియా గురించి కేసీఆర్‌ అన్న మాటలేంటో కేటీఆర్ మరోసారి వినాలని హితవు పలికారు. రాష్ట్రంలో కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజల్లో రోజురోజుకీ పెరిగిపోతున్న వ్యతిరేకతను గుర్తించిన కేసీఆర్‌ అధికార దాహంతోనే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై 3,600 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ స్వార్థ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌ అహంకారంతో వ్యవహరిస్తూ ప్రశ్నించే వారిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. దురహంకారంతో విర్రవీగుతున్న టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు ఓట్లు చీలకుండా ఉండేందుకే మహా కూటమి ఏర్పడిందని, తనను ఆడబిడ్డలా ఆదరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

More Telugu News