Nalgonda District: పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యా యత్నం.. ఇద్దరు పిల్లల మృతి!

  • ముగ్గురు బిడ్డలతో కాలువలోకి దూకిన మహిళ
  • ఇద్దరు కుమార్తెలు మృతి...బాలుడు గల్లంతు
  • బాధితురాలిని రక్షించిన పోలీసులు...పరిస్థితి విషమం

నిత్యం ఆవేదన...భవిష్యత్తు అగమ్య గోచరం...భర్తలో మార్పు వచ్చే అవకాశం లేదన్న ఆందోళన...ఆ ఇల్లాలిని ఈ లోకాన్నే విడిచివెళ్లి పోవాలన్నంత తెగింపులోకి నెట్టేసింది. తాను చనిపోతే తన పిల్లల పరిస్థితి ఏమిటి? అనే ఆలోచన రావడంతో ‘తనతో పాటే వారూ’ అనుకుంది. అంతే, ముగ్గురు పిల్లల్ని తీసుకుని సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి దూకేసింది. ఇద్దరు ఆడ పిల్లలు చనిపోగా, బాలుడు గల్లంతయ్యాడు. బాధితురాలిని పోలీసులు రక్షించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

 నల్గొండ జిల్లా అనుముల మండలంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి. పెద్దవూర స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అంగోతు మోహన్‌, దామరచర్ల మండలం గోనేతండా కేజే కానీకి చెందిన స్వాతి (25) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పిల్లల చదువు కోసం నాలుగేళ్లుగా అనుముల మండం హాలియాలోని వీరయ్యనగర్‌లో  స్వాతి నివాసం ఉంటోంది.

మద్యానికి బానిసైన భర్త కుటుంబ బాధ్యతల విషయంలో పట్టనట్లు వ్యవహరించడంతో దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇక భర్తలో ఎప్పటికీ మార్పు రాదన్న నిర్ణయానికి వచ్చిన స్వాతి చనిపోవడమే ఉత్తమమనుకుంది. శుక్రవారం భర్త ఇంట్లో ఉండగా పిల్లల్ని యథావిధిగా స్కూలుకు పంపింది. తాను చనిపోతే పిల్లలు అనాథలైపోతారన్న ఆలోచన రాగానే స్కూలుకువెళ్లి భోజనం పెట్టాలని చెప్పి వెనక్కి తీసుకువచ్చింది.

వారిని తీసుకుని హాలియా సమీపంలోని నాగర్జునసాగర్‌ ఎడమ కాల్వ వద్దకు వెళ్లింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పక్కింటి ఆటోడ్రైవర్‌ ఆమెను అనుసరించాడు. కాలువ వద్దకు రాగానే డ్రైవర్‌ వెంట వస్తున్న విషయాన్ని గమనించిన స్వాతి కొడుకు మమంతకుమార్‌ (3)ను తొలుత కాలువలోకి విసిరేసింది. తర్వాత ఇద్దరు కూతుర్లు సాత్విక (6), మధునశ్రీ (4)లను పట్టుకుని తానూ దూకేసింది.

దీని గురించి ఆటో డ్రైవర్ చెబుతూ ‘ఈ హఠాత్పరిణామంతో విస్తుపోయిన నేను ఒడ్డున ఉన్న ఆమె చున్నీని నీళ్లలో వేశాను. దాన్ని పట్టుకోమని స్వాతిని వేడుకున్నా ఆమె వినలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను’ అని తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని స్వాతిని, ఆమె ఇద్దరు కుమార్తెలను రక్షించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పిల్లలిద్దరూ చనిపోగా స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. బాలుడి ఆచూకీ తెలియరాలేదు. స్వాతి జీవితంపై పూర్తి విరక్తి చెందే ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

More Telugu News