పృథ్వీ షాలో కొంచెం సచిన్, కొంచెం సెహ్వాగ్ ఉన్నారు: ప్రశంసల వర్షం కురిపించిన రవిశాస్త్రి

05-10-2018 Fri 10:57
  • 154 బంతుల్లో 134 పరుగులు చేసిన పృథ్వీ 
  • ఇలాగే భయం లేకుండా ఆటను కొనసాగించన్న సచిన్
  • ఈ కుర్రాడిలో చాలా దమ్ముందన్న సెహ్వాగ్

ఆడిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా, విండీస్ బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ చేసిన యువకెరటం పృథ్వీ షాపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. పృథ్వీని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆకాశానికెత్తేశాడు. 'అద్భుతంగా ఆడావు యంగ్ మెన్. అరంగేట్ర మ్యాచ్ లోనే ఏ మాత్రం భయం లేకుండా ఆడావు. నీలో సగం సచిన్, సగం సెహ్వాగ్ కనిపిస్తున్నారు' అంటూ ట్వీట్ చేశాడు.

సచిన్ కూడా పృథ్వీపై ప్రశంసలు కురిపించాడు. 'తొలి ఇన్నింగ్స్ లోనే నీవు దాడి చేస్తుంటే చూడ ముచ్చటగా అనిపించింది. ఇలాగే భయం లేకుండా నీ ఆటను కొనసాగించు' అని ట్విట్టర్ ద్వారా సూచించాడు. సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ... ఇది ఆరంభం మాత్రమేనని, ఈ కుర్రాడిలో చాలా దమ్ము ఉందని చెప్పాడు. 154 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో పృథ్వీ 134 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.