ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చిన యువతిపై చేయిచేసుకున్న తహసీల్దార్!

04-10-2018 Thu 08:22
  • నల్గొండ జిల్లా నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఘటన
  • యువతిపై చేయి చేసుకున్న తహసీల్దార్ ప్రమీల
  • ప్రమీలతో యువతి బంధువుల వాగ్వివాదం

ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చిన యువతిపై నల్గొండ జిల్లా నాంపల్లి తహసీల్దార్ కేసీ ప్రమీల చేయి చేసుకున్నారు. దీంతో యువతి కన్నీరు మున్నీరైంది. నాంపల్లి మండలం చిట్టంపహాడ్‌కు చెందిన ఉగ్గపల్లి సరిత ఇన్‌కం, క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చింది.

ధ్రువీకరణ పత్రాల కోసం కంప్యూటర్ కౌంటర్ వద్ద నిరీక్షిస్తున్న సమయంలో చాంబర్ నుంచి బయటకు వచ్చిన తహసీల్దార్ ప్రమీల ఆమెపై చేయి చేసుకున్నారు. ఇక్కడ నీకేం పనంటూ తనపై తహసీల్దార్ చేయి చేసుకున్నారని సరిత ఆరోపించింది. విషయం తెలిసిన యువతి బంధువులు కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్‌తో గొడవకు దిగారు. తానెవరిపైనా చేయి చేసుకోలేదని, రద్దీ ఎక్కువగా ఉండడంతో పక్కకు జరగాల్సిందిగా చేతితో తట్టి సూచించానని తహసీల్దార్ వివరణ ఇచ్చారు.