parchuri gopala krishna: ఇది పరువు హత్య కాదు ‘పంతం హత్య’: పరుచూరి గోపాలకృష్ణ

  • ప్రణయ్-అమృత, మాధవి ఉదంతాలు బాధ కల్గించాయి
  • మనం పెంచిన చెట్టును నరికే హక్కే ఉండదు
  • పెంచిన బిడ్డను అలా చేయాలన్న ఎమోషన్ ఎందుకు?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరువు హత్య, ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిపై దాడి సంఘటనలు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలు తనను కలచివేశాయని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

‘పరుచూరి పలుకులు’ లో ఆయన మాట్లాడుతూ, ‘అభ్యదయాన్ని ప్రేమించిన మనిషిగా, ఒక ఆచార్యుడిగా, రచయితగా.. సమాజంలో జరుగుతున్న వాటిపై స్పందించాలి. ప్రణయ్-అమృత ఉదంతం, ఆ తర్వాత మాధవి ఘటన.. బాధేసింది. ఎందుకంటే, మనం పెంచిన చెట్టును నరికే హక్కే మనకు ఉండదు. కానీ, పెంచిన బిడ్డను అలా చేయాలన్న ఎమోషన్ కు ఎందుకు గురవుతున్నారు? ఇది బాధ కలిగించే విషయం.

హత్యలు కానీ, ఆత్మహత్యలు గానీ క్షణికావేశంలో జరుగుతాయంటారు. కానీ, ఇవి క్షణికావేశంలో జరగలేదు. కోపం రోజురోజుకీ పెరిగి పెద్దదైపోయి.. ఒక పంతంలా మారిపోయి.. ఒక పంతం హత్యలా ఇదనిపించింది. పరువుహత్య అని మనవాళ్లు పేరు పెడుతున్నారు. ‘పంతం హత్య’ అని నేను అనుకుంటాను.. ఇది కులం కోసం అనడం కన్నా పంతం కోసం జరుగుతోంది.. నాగరికతకు అనుగుణంగా మనుషులు కూడా మారాలి’ అని సూచించారు.

హత్యలు, రేప్ లు చేసిన వాళ్లను పదేపదే చూపిస్తుంటే.. సమాజంలో కొంత మంది తెలియని ప్రభావానికి లోనై, అలాంటి నేరాలు చేసే ప్రమాదం ఉందని తనకు అనిపిస్తోందని, ఇలాంటి ఘటనలు అదేపనిగా చూపించొద్దని, వీటిపై డిబేట్స్ నిర్వహించొద్దని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు.  ఇలాంటి ఘటనలలో జరిగిన నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరని, ప్రాణంపోతే తిరిగి రాదని, మనసులోనే పిల్లలను ఆశీర్వదించి ఊరుకోవాలి తప్ప, అలాంటి పనులకు ఏ తల్లిదండ్రులు పూనుకోవద్దని కోరారు. 

More Telugu News