Narendra Modi: మోదీని చంపాల్సిన అవసరం మాకు లేదు.. అలాంటి లేఖలను మేం రాయం!: లేఖలో స్పష్టం చేసిన మావోయిస్టులు

  • పోలీసులు నకిలీ లేఖలు చూపిస్తున్నారు
  • మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది
  • లేఖను విడుదల చేసిన మావో కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్

విరసం నేత వరవరరావు, హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, గౌతమ్ నవలఖాలను మహారాష్ట్ర పోలీసులు ఆగస్టు 28న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులు పన్నిన కుట్రలో వీరికి ప్రమేయం ఉందని పోలీసులు ఆరోపించారు. అలాగే గతేడాది డిసెంబర్ లో మహారాష్ట్రలోని పుణె సమీపంలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశం అనంతరం వీరే హింసను రెచ్చగొట్టారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఐదుగురు హక్కుల కార్యకర్తలను సుప్రీంకోర్టు 4 వారాల పాటు హౌస్ అరెస్ట్ లో ఉంచింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు వీరి అరెస్టులపై స్పందించారు.

ప్రధాని మోదీ హత్యకు తాము పౌర హక్కుల నేతలతో కలసి కుట్ర పన్నలేదని పేర్కొంటూ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి చెందిన అభయ్ లేఖ విడుదల చేశారు. హక్కుల నేత రోనా విల్సన్ దగ్గర దొరికినట్లు పోలీసులు చెబుతున్న లేఖలు బూటకమని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. పౌర హక్కుల నేతలపై జరుగుతున్న అణచివేతలపై ప్రజాస్వామ్య వాదులు స్పందించాలని కోరారు. ప్రధానిని హత్య చేయాలని తాము ఎవరికీ లేఖ రాయలేదనీ, అలాంటి అవసరం తమకు లేదని అభయ్ స్పష్టం చేశారు.

పుణెలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశం అనంతరం దళితులకు-అగ్రవర్ణాలకు మధ్య భీమా-కోరేగావ్ ప్రాంతంలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు హక్కుల కార్యకర్త రోనా విల్సన్ ఇంటిలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు మావోలు రాసుకున్న లేఖలు తమకు దొరికాయని పోలీసులు కోర్టుకు తెలిపారు.

మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ హత్య తరహాలో మోదీని మట్టుబెట్టేందుకు మావోలు ప్లాన్ వేశారనీ, ఇందుకోసం ఆయుధాల కొనుగోలుకు వరవరరావు సాయం చేస్తాడని లేఖలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది.

More Telugu News