Musharraf: నానాటికీ క్షీణిస్తున్న ముషారఫ్ ఆరోగ్యం!

  • గుర్తు తెలియని రోగంతో బాధపడుతున్న ముషారఫ్
  • లండన్ వెళ్లి వస్తూ చికిత్స పొందుతున్నారు
  • వెల్లడించిన ఏపీఎంఎల్ నేత అమ్జాద్

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, నాటి సైనికాధినేత పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోందట. ఆయన అంతుబట్టని వ్యాధితో బాధపడుతున్నారని, ఇప్పట్లో కోర్టు కేసుల విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని ఆల్ పాకిస్థాన్ ముస్లిమ్ లీగ్ (ఏపీఎంఎల్) నేత ముహమ్మద్ అమ్జాద్ వెల్లడించారు. 2007లో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసిన కేసులో ఆయనపై విచారణ సాగుతుండగా, 2016 నుంచి ముషారఫ్ దుబాయ్ లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతి మూడు నెలలకూ ఓమారు లండన్ వెళ్లి చికిత్స తీసుకుంటున్నా, ఆరోగ్యం మెరుగుపడలేదని అమ్జాద్ వ్యాఖ్యానించినట్టు 'డాన్' పత్రిక పేర్కొంది.

ఆయన వెన్నెముక విరిగిందని, చికిత్స కోసం అమెరికాకు కూడా వెళ్లి వచ్చారని, ఇప్పుడు మరో రుగ్మతతో బాధపడుతూ, లండన్ కు వెళ్లి వస్తున్నారని అమ్జాద్ తెలిపారు. ఆయనకున్న రుగ్మత గురించి దేశానికి ఇప్పుడేమీ చెప్పలేమని, అయితే, కోర్టుకు మాత్రం డాక్యుమెంట్లను సమర్పిస్తామని అన్నారు. ఏదో ఒకరోజు ఆయన పాకిస్థాన్ కు వచ్చి, కోర్టు విచారణకు హాజరవుతారని అన్నారు.

More Telugu News