Pakistan: పర్సు కొట్టేసి.. పాకిస్థాన్ పరువును నడిబజారులో పడేసిన ఆ దేశ ఉన్నతాధికారి!

  • సమావేశాల కోసం వచ్చిన కువైట్ అధికారి పర్సు చోరీ
  • కోటులో వేసుకుని జారుకున్న అధికారి
  • తలవంపులు తెచ్చారన్న పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ
పాకిస్థాన్ పరువును ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు మంటగలిపారు. తమ దేశానికి పర్యటనకు వచ్చిన కువైట్ అధికారి పర్సును దొంగలించాడు. ఎవరూ లేరు కాబట్టి తన హస్తలాఘవం గురించి ఎవరికీ తెలియదని భావించాడు. అయితే, మూడో నేత్రం సీసీ టీవీకి మాత్రం అడ్డంగా దొరికిపోయి దేశానికి అవమానం తెచ్చి పెట్టాడు.

పాకిస్థాన్-కువైట్ మంత్రుల రెండు రోజుల సంయుక్త సమావేశం కోసం కువైట్ అధికారి పాక్ వచ్చాడు. సమావేశం ముగిసిన అనంతరం మందిరాన్ని అందరూ ఖాళీ చేయగా, కువైట్ అధికారి తన టేబుల్‌పై పర్సు మర్చిపోయి వెళ్లిపోయారు. టేబుల్‌పై పర్సు చూసిన పాక్ ఇన్వెస్టిమెంట్ అండ్ ఫెసిలిటేషన్‌ జాయింట్‌ సెక్రటరీ జరార్ హైదర్ ఖాన్ మనసు లాగేసింది. అటుఇటు చూసి పర్సును తీసి గబుక్కున తన కోటు జేబులో వేసుకున్నాడు.

పర్సు పోయిన అధికారి ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా జరార్ చేతివాటం వెలుగులోకి వచ్చింది. జరార్ చోరీ చేయడం చూసి తాము విస్తుపోయినట్టు పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్న మంత్రిత్వ శాఖ.. ఖాన్ తన చర్యలతో దేశానికి తలవంపులు తీసుకొచ్చారని పేర్కొంది. అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Pakistan
Kuwait
bureaucrat
steal
wallet
delegate

More Telugu News