TRS: వివాహేతర సంబంధాలపై సుప్రీం తీర్పు పట్ల టీఆర్ఎస్ నేత వినోద్ ఆందోళన.. కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ!

  • సుప్రీం తీర్పును తప్పుగా అన్వయిస్తున్నారు
  • వివాహేతర సంబంధాలకు సుప్రీం కోర్టు అనుమతి అంటూ ప్రచారం
  • అర్జెంటుగా చట్టం తీసుకురండి

వివాహేతర సంబంధం నేరం కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష ఉప నేత బి.వినోద్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధం విషయంలో స్త్రీపురుషులిద్దరికీ శిక్షలు పడేలా భారత శిక్షా స్మృతిలో సెక్షన్‌ను చేర్చాలంటూ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లును తీసుకురావాలని అందులో కోరారు. వివాహేతర సంబంధం ఎప్పటికీ అక్రమమేనని, సెక్షన్ 497ను రద్దు చేయడం వల్ల కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
 
భారత సంస్కృతిలో కుటుంబ, వివాహ వ్యవస్థలకు ఎంతో విలువ ఉందన్న వినోద్ కుమార్.. వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీం తీర్పును సామాజిక మాధ్యమాల్లో  తప్పుగా అన్వయిస్తూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వివాహేతర సంబంధాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ కార్టూన్లు, వ్యాఖ్యలతో తప్పుదోవ పట్టిస్తున్నారని వినోద్ పేర్కొన్నారు. దీనివల్ల  సమాజంలో, కుటుంబ వ్యవస్థలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి వివాహేతర సంబంధం ఎవరు పెట్టుకున్నా స్త్రీపురుషులిద్దరికీ శిక్షలు పడేలా చట్టం తీసుకురావాలని కోరారు.

More Telugu News