Revanth Reddy: రేవంత్ రెడ్డితో సంబంధాలు, రూ. 4.50 కోట్ల గురించి ప్రశ్నించారు: సెబాస్టియన్

  • రేవంత్ తో సంబంధాలు లేవని చెప్పాను
  • చట్టం అనుమతిస్తే అన్ని విషయాలు బట్టబయలు చేస్తా
  • నన్ను అనవసరంగా బలిపశువును చేస్తున్నారు

ఓటుకు నోటు కేసులో నిందితుడైన సెబాస్టియన్ ఇంట్లో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీ సోదాలు చేయబోతున్నామని అధికారులు తనకు నోటీసు ఇచ్చారని... సంతకం చేసి, నోటీసులు తీసుకున్నానని చెప్పారు. మీ పని మీరు చేయండని తాను చెప్పానని తెలిపారు. కాసేపటి తర్వాత... కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో మీకు సంబంధం ఏమిటని ప్రశ్నించారని, రేవంత్ తో తనకు ఎలాంటి సంబంధాలు, లావాదేవీలు లేవని తాను చెప్పానని తెలిపారు. రేవంత్ గురించి తనకు ఏమీ తెలియదని, ఆయనకు ఎన్ని కంపెనీలున్నాయో కూడా తెలియదని చెప్పానని అన్నారు.

స్టీఫెన్ సన్ నివాసంలో రూ. 50 లక్షలు దొరికాయని... మిగిలిన రూ. 4.50 కోట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారని సెబాస్టియన్ తెలిపారు. దానికి సమాధానంగా... తన బ్యాంక్ అకౌంట్లన్నీ చెక్ చేసుకోవచ్చని చెప్పానని అన్నారు. డబ్బుకోసమే తాను ఈ కేసులో ఉన్నానని అందరూ అనుకుంటున్నారని... తనను అనవసరంగా బలిపశువును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లువాళ్లు మాట్లాడుకున్నారని... మనీ డీల్ తో తనకు సంబంధం లేదని చెప్పారు.

ఒక క్రైస్తవుడిని, ఒక పార్టీని కాపాడాలనే తాను అక్కడకు వెళ్లానని చెప్పారు. కేసుకు సంబంధించి తాము రెగ్యులర్ గా కోర్టుకు హాజరవుతున్నామని... కేసుకు సంబంధించిన విషయాలు బయటమాట్లాడకూడదని తమకు షరతు విధించారని అన్నారు. చట్టానికి లోబడి తాము ఇంత వరకు నోరు తెరవలేదని చెప్పారు. చట్టం అనుమతిస్తే అన్ని విషయాలను బట్టబయలు చేస్తామని తెలిపారు. తమకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా రెండు రోజులు ఆపించారని, అంతటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానిదని విమర్శించారు.

More Telugu News