రాయలసీమలో పిడుగులు పడచ్చు.. హెచ్చరించిన ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ!

26-09-2018 Wed 09:16
  • మూడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం 
  • జాగ్రత్తగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ శాఖ
  • అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచన

గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం చిత్రవిచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. అకస్మాత్తుగా వానలు, మంచుగడ్డలు కురవడంతో పాటు మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ‘పిడుగు’లాంటి వార్త చెప్పింది. రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది.

అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ, వజ్రకరూర్, గుంతకల్, కడప జిల్లాలోని లింగాల, కర్నూలు జిల్లాలోని హాల్వహర్వి, చిప్పగిరి మండలాలు, పరిసర ప్రాంతాల్లో రాబోయే 24 గంటల్లో పిడుగులు పడతాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, ఆకాశం మేఘావృతమైన సందర్భాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.