Hyderabad: కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లి హిమాలయాల్లో చిక్కుకున్న హైదరాబాద్ కుటుంబం.. కాపాడాలంటూ వేడుకోలు

  • కేదార్‌నాథ్ యాత్రకు గోపాల్ కుటుంబం
  • భారీ వర్షాలతో కూలిన వంతెన
  • బంధువులు, కుటుంబ సభ్యుల ఆందోళన

కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఓ హైదరాబాద్ కుటుంబం హిమాలయాల్లో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. తప్పించుకునే మార్గం లేక, కాపాడేవారు కనిపించకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతోంది. తమను రక్షించాలంటూ గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ షేర్ చేసింది. విషయం తెలిసిన ఇక్కడి వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన గోపాల్ తన ఐదుగురు కుటుంబ సభ్యులతో కేదార్‌నాథ్ యాత్రకు బయలుదేరారు. అయితే, భారీ వర్షాల కారణంగా మార్గమధ్యంలోని వంతెన కూలిపోవడంతో అక్కడ చిక్కుకుపోయారు. ఎటెళ్లాలో తెలియక అల్లాడిపోతున్నారు. తమను రక్షించాలంటూ గోపాల్ షేర్ చేసిన గూగుల్ మ్యాప్స్ ఒక్కటే ఇప్పుడు వారిని రక్షించేందుకు ఉన్న ఏకైక మార్గం. వారు షేర్ చేసిన దాన్ని బట్టి వారు ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, భక్తులు అందరూ చెల్లాచెదురయ్యారని గోపాల్ తెలిపారు. కాగా, గోపాల్ కుటుంబాన్ని రక్షించాలంటూ ఆయన కుటుంబసభ్యులు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

More Telugu News