Telangana: ఆషామాషీగా తీసుకుంటే వచ్చే కేబినేట్ లో మీ తుమ్మల ఉండడు!: పార్టీ నేతలతో మంత్రి తుమ్మల

  • టికెట్‌ ఇచ్చిన వారిని కష్టపడి గెలిపించుకోవడమే మన బాధ్యత
  • ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పిడమర్తి రవిది ప్రత్యేక పాత్ర
  • అతని గెలుపునకు సమష్టి కృషి చేయాలి

ఎన్నికల వేళ టికెట్ల కేటాయింపు విషయంలో అధిష్ఠానమే సుప్రీం అని, టికెట్లు దక్కించుకున్న వారిని గెలిపించుకోవడమే కార్యకర్తలు, నాయకుల బాధ్యత అని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సత్తుపల్లి పట్టణంలో జరిగిన టీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశ పార్టీ నాయకుల్లో చాలా మందికి ఉండడం సహజమని, అన్ని అంశాలను బేరీజు వేసుకుని టికెట్టు కేటాయించే అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు.

సత్తుపల్లి నియోజకవర్గం టికెట్టు సాధించుకున్న పిడమర్తి రవి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా తుమ్మల గుర్తు చేశారు. ఆయనను కేసీఆర్‌ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కార్యకర్తల్లో నూతనోత్సాహం పెరిగిందని, రవిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ‘సత్తుపల్లిలో టీఆర్‌ఎస్‌ గెలుపు మీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, నియోజకవర్గం భవిష్యత్తు, జిల్లా భవిష్యత్తును నిర్దేశిస్తుంది. రవిని గెలిపించి తీరుతానని కేసీఆర్‌కు మాటిచ్చాను. మీరు ఆషామాషీగా తీసుకుంటే కనుక మీ మనిషి తుమ్మల వచ్చే కేబినేట్ లో వుండడు. ఏ మాత్రం అలక్ష్యం వహించినా అందరం నష్టపోతాం. ఇవి నా మాటలు కాదు, కేసీఆర్‌ మాటలు’ అని తుమ్మల ఉద్వేగంగా మాట్లాడారు.

త్వరలోనే సత్తుపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, ఈ సభకు కేసీఆర్‌ హాజరవుతారని తెలిపారు. టికెట్టు రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న డాక్టర్‌ మట్టా దయానంద్‌ను పిలిపించి మాట్లాడానని, కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని కోరినట్లు తెలిపారు.

More Telugu News