Chandrababu: ధర్మాబాద్ కోర్టుకు చంద్రబాబు వెళ్లడం లేదు.. ఆయన లాయర్ హాజరవుతారు!: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

  • నాన్ బెయిలబుల్ వారెంట్ పంపామన్న నాందేడ్ ఎస్పీ
  • తమకు అందలేదని జవాబిచ్చిన ఏపీ పోలీసులు
  • 2010లో నమోదైన కేసు

బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేక ఆందోళనల కేసుకు సంబంధించి ఈ నెల 21న కోర్టు విచారణకు సీఎం చంద్రబాబు వెళ్లడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. చంద్రబాబు తరఫున ధర్మాబాద్ కోర్టులో జరిగే విచారణకు ఆయన న్యాయవాది హాజరవుతారని వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి చార్జ్ షీట్, నాన్ బెయిలబుల్ వారెంట్ సహా ఇతర పత్రాలను మహారాష్ట్ర పోలీసుల నుంచి తీసుకోవాలని నిర్ణయించింది.

మరోవైపు కోర్టుకు చంద్రబాబు హాజరయ్యే విషయమై నిన్న ఏపీ పోలీస్ ఉన్నతాధికారులతో నాందేడ్‌ ఎస్పీ ఫోన్‌‌లో మాట్లాడారు. చంద్రబాబుకు నాన్‌-బెయిలబుల్‌ వారెంట్ తో కూడిన లేఖను పంపామని నాందేడ్ ఎస్పీ తెలపగా, తమకు లేఖ మాత్రమే అందిందనీ, వారెంట్ అందలేదని పోలీసులు జవాబిచ్చారు. కేసు పత్రాలు లేకుండా ఎలా రమ్మంటారని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఆయన్ను ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా టీడీపీ 2010లో ఆందోళనలు నిర్వహించింది. దీంతో చంద్రబాబు సహా 40 మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని విమానంలో హైదరాబాద్ కు తరలించారు. 

More Telugu News